
లోక రక్షకుడిని స్మరించుకోవాలి
రెంటచింతల: ఏసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకలలో లోకరక్షకుడైన ఏసయ్యను క్రైస్తవులందరూ స్మరించుకోవాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతి మహాఘన డా. చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. ఆదివారం కానుకమాత కళావేదిక వద్ద విచారణ గురువులు రెవ. ఫాదర్ వైఎల్ మర్రెడ్డి ఆధ్వర్యంలో క్రీస్తు జయంతి జూబ్లీ వేడుకల సమష్టి పవిత్ర పూజాబలి సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వస్థత, ఆరాధన, విశ్వాసం పేరిట ఇవి కొనసాగుతున్నాయని వివరించారు. క్రైస్తవుల కోసం ప్రతి ఒక్కరూ తమ పాత్రను గుర్తించి ప్రార్థించాలన్నారు. పల్నాడు పరిధిలోని ఫాదర్లు, కన్యలు, క్రైస్తవ విశ్వాసులు ఈ వేడుకలలో పాలుపంచుకోవడం అభినందనీయం అన్నారు. ముందుగా అమ్మ జపమాల ప్రార్థన, జాతీయ పతాకం, రోమ్ నగరం పతాకం, జూబ్లీ వేడుకల పతాకాలను ఆవిష్కరించారు. తర్వాత దివ్య ప్రసాద ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వేల మంది భక్తులకు మహా అన్నదానం చేపట్టారు. కానుకమాత చర్చి సహాయ గురువులు రెవ. ఫాదర్ ప్రసన్న కుమార్, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
మేత్రాసన పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య

లోక రక్షకుడిని స్మరించుకోవాలి