
హరిత దీపావళి.. ఆనంద హేళి
యడ్లపాడు: దీపావళి అంటేనే ప్రమిద దివ్వెలు..బాణసంచా వెలుగులు. పండుగలన్నింటిలో దీపావళి సందడి వేరు. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగగా..విజయానికీ ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వీయుజ మాసంలో ఆమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ అంటే అన్ని కష్టాలు మరచి కుటుంబమంతా సంతోషంగా గడిపే సందర్భం. అయితే మితిమీరిన ఉత్సాహంతో మన ఆనందాన్ని తీవ్ర ఆవేదనగా మార్చకూడదు. ఈ పండుగను మరో ఏడాదిపాటు మరవలేని తీపి గుర్తుగా నిర్వహించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల స్ఫూర్తితో నేడు దీపావళి పండుగను ఆనందంగా, ఆహ్లాదంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
● దీపావళి పండుగ సందర్భంగా జరిగే ప్రమాదాలు, కాలుష్యంపై పర్యావరణ నిపుణులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు హరిత దీపావళిని నిర్వహించుకోవాలంటూ ఆదేశించింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాణసంచా నిషేధించాలని ఈ ఏడాది సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. టపాసులు కాల్చడానికి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, రోజులో ఏవైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు సడలింపు ఇచ్చింది. టపాసులు ఇళ్ల లోపల కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు మూలల్లో నిలిచిపోయి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
● ఈ నిబంధనల నేపథ్యంలో పర్యావరణ హితమైన ‘గ్రీన్ టపాసులు’ (తక్కువ పొగ, తక్కువ శబ్దం) మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. శబ్దాలు చేసే టపాసుల స్థానంలో ఫ్లవర్ పార్ట్స్, పెన్సిల్స్, భూ చక్రాలు, స్పార్కులర్లు, కాకరొత్తులు, చిచ్చుబుడ్లు వంటి సురక్షితమైనవి మాత్రమే కాల్చుకోవడం మంచిది. మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుద్ధీపాలు వెలిగించడం శుభప్రదం. ముఖ్యంగా నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆక్సిజన్ కూడా అధికంగా వెలువడుతుందని పెద్దలు చెబుతున్నారు.
● టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, కళ్లకు రక్షణగా కళ్లజోడు, పాదాలకు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సగం కాలిన టపాసులను మరోసారి కాల్చాలని ప్రయత్నించి దగ్గరకు వెళ్లవద్దని, అవి ఆకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉందని అగ్నిమాపక అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటిని వదిలేయడమే ఉత్తమం. పండుగ సరదా శాపంగా మారకుండా ఉండాలంటే, కాలుష్యంతో పాటు ప్రమాదాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. టపాసుల తయారీలో వాడే విషపూరిత రసాయనాలు, లోహాలు గాలి, శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి. అందువల్ల పూర్తిగా విషపూరితమైన వాటిని కాల్చి మన ప్రమాదాన్ని మనమే సృష్టించుకున్నట్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని ఆనందంగా, ఆరోగ్యంగా, పర్యావరణహితంగా జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది.