
అ‘పూర్వం’.. ఆత్మీయం!
విజయపురిసౌత్: సుమారు 44 ఏళ్ల క్రితం వారంతా కలిసి చదువుకున్నారు. చదువులమ్మ ఒడిలో ఆడిపాడారు. ఆ తరువాత విడిపోయారు. సుదీర్ఘ జీవన ప్రయాణంలో విభిన్నదారుల్లో సాగి వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించారు. జీవితం యాంత్రికమైపోయింది. మనసులో ఏదో తెలియని వెలితి అందరిని పట్టి పీడించింది. మూలమేదో గుర్తించారు. ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలిగితే చాలు అనుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 25 మంది చిరునామాలను సేకరించారు. వివరాల్లోకి వెళితే.. విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980–81 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సికింద్రాబాద్ పార్క్ హోటల్లో కలుసుకొని ఒకే వేదికపై చేరుకున్నారు. ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం... అపురూపమైన ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నెంబర్లు, చిరునామాలు సేకరించుకున్నారు. తమ ఉన్నతికి దోహదపడిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను తమ స్నేహబంధానికి గుర్తుగా గ్రూఫ్ ఫొటోలు దిగారు. తమ తోటి విద్యార్థులు కలిసేందుకు అందరి చిరునామాలు సేకరించి ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆర్గనైజర్, ఎంపీడీఓ బి.నాగరాజును పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పూర్వ విద్యార్థులు పైడి నాయుడు, ఎస్‌వీ రమేష్, శ్రీనివాసరెడ్డి, ఐజక్, రంగారెడ్డి, జంగయ్య, ఆయేషాను సత్కరించారు. పూర్వ విద్యార్థులు సౌత్‌సెంట్రల్ రైల్వే డీసీఎం కె.కమలాకర్‌బాబు, నల్గొండ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసరావు, మిర్యాలగూడ కేరలి విద్యాసంస్థల అధినేత షేక్ అహమ్మద్, బెంగళూరు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ అబ్ధుల్ రజాక్, ఉపాధ్యాయుడు యు.వెంకటేశ్వరావు, మాలతి, సరళ, లిల్లి, మాస్క్ కుర్మానీ, కనకవల్లి తదితరులు పాల్గొన్నారు.
44 ఏళ్ల తరువాత కలుసుకున్న విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980–81 బ్యాచ్ టెన్త్ విద్యార్థులు