
శుద్ధమైన వాయువు ఆరోగ్యానికి కీలకం
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గ్రామంలో మొక్కలు నాటిన కలెక్టర్
పిడుగురాళ్ల: శుద్ధమైన వాయువు మన ఆరోగ్యానికి అంత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని స్వచ్ఛమైన గాలి అంశంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కృతికా శుక్లా మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, మొక్కలు నాటి, వాతావరణాన్ని హరితవనంగా మార్చాలన్నారు. భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే మనం గాలిని కలుషితం చేయకూడదని దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలన్నారు. ప్రజా సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని, దీని ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారని అన్నారు. అనంతరం గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం మాట్లాడుతూ వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. దీపావళి సందరన్భంగా పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. అనంతరం దీపావళి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏపీపీసీబీ వారిచే రూపొందించబడిన ప్రత్యేక పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.