
స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలి
బాపట్ల: ‘పరిశుభ్రత వైపు ఒక అడుగు’ నినాదంతో స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలని, ప్రజారోగ్యం, పర్యావరణ స్థిరత్వం దిశగా ప్రతి అడుగూ కృత నిశ్చయంతో వేయాలని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ ఇన్‌చార్జి డీన్ ఎస్.ఆర్. కోటేశ్వరరావు తెలిపారు. ప్రతి నెలా మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు ఈ సామాజిక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణతో ప్లాస్టిక్ భూతాన్ని భూతలం నుంచి పారదోలాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల దాపురిల్లే భయంకరమైన పరిణామాల గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల విలువైన పశుసంపద బలి కావడం దారుణమని తెలిపారు. దీని వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, యువత అప్రమత్తంగా ఉండి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణను విద్యార్థులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎం.రమాదేవి, సి. సంధ్యారాణి, జి.విజయకుమార్, షేక్ అబ్దుల్ సలాం, విద్యార్థులు పాల్గొన్నారు.