
పలు పంటల సాగుతో రైతు పదిలం
యడ్లపాడు: వ్యవసాయంలో అన్నదాత నష్టపోకూడదంటే పాత మూస పద్ధతులు, ఏక పంటపై ఆధారపడటం సరికాదని, పలు పంటల విధానమే రైతుకు పదిలం అని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కె అమలకుమారి పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు సాగు చేసిన పలు రకాల పంటలను సిబ్బందితో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. పలు పంటల సాగు చేస్తున్న రైతులు తిరుపతిరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుల కంపాక్ట్ బ్లాక్‌లను పరిశీలించారు. ముఖ్యంగా రైతు వెంకటేశ్వరరావు తన పొలంలో ప్రధాన పంటగా దొండసాగులో, అంతర పంటలుగా బెండ, గోరుచిక్కుడు, పప్పు చిక్కుడు, టమాటా, వంకాయ, సొరకాయ, ఉల్లి, కాకర, పొట్లకాయ, బంతి వంటి పదికి పైగా కూరగాయలు సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. బహుళపంటల సాగు విధానం ద్వారా తాను నెలకు రూ.29,500 స్థిర ఆదాయం పొందుతున్నట్లు రైతు వెంకటేశ్వరరావు డీపీఎంకు తెలిపారు. ప్రకృతి సేద్యంతో పండిన కూరగాయలతో తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండటంలో పాటు సాగు చేసిన నేల కూడా సారవంతంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం డీపీఎం అమలకుమారి రైతులతో మాట్లాడుతూ పలు పంటలు సాగు చేయడం వలన నేలలో జీవవైవిధ్యం పెరిగి భూసారం మెరుగుపడుతుందని, సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు పోషకాలు లభిస్తాయని, తద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఆమె వివరించారు. అందుకే భూ మాతకు పలు పంటలు ముద్దు, ఏకపంట వద్దు అంటూ కీలక సూచనలు చేశారు. ప్రకృతి సాగు విధానంతో రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి, ఘన, ద్రవ జీవామృతాలు, పశువులపేడ, మూత్రం, సహజ అవశేషాలను వినియోగించడం ద్వారా రైతులకు సాగు పెట్టుబడి గణనీయంగా తగ్గి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అన్నింటికీ మించి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతిగ్రామంలో ప్రకృతి సేద్యం విస్తరించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పలు పంటల సాగు రైతు జీవనాన్ని వెలుగులోకి తెస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ విధానంతో ఆదర్శంగాా నిలుస్తున్న రైతుల్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ విభాగం
డీపీఎం డాక్టర్ కె అమలకుమారి