
పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం
వినుకొండ: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ చేతిలో హత్యకు గురైన కాపు సామాజిక వర్గానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కాపు సంఘం నాయకులు కోరారు. వినుకొండ నియోజకవర్గం కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ముండ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా పూర్తిస్థాయిలో సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రులను కోరనున్నట్లు తెలిపారు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలన్నారు. లక్ష్మీనాయుడు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దాడిలో గాయపడిన పవన్, భార్గవ్‌ల వైద్య ఖర్చులతోపాటు వారిరువురికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి వారికి ఇంటి స్థలం కేటాయించాలన్నారు. లక్ష్మీనాయుడు పిల్లల చదువుల నిమిత్తం వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించి కూటమిని గెలిపించాలని కోరిన పవన్ కల్యాణ్ మాటలు విని కాపులు ఓట్లేస్తే కాపులపై ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో కాపు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు, నాయకులు మల్లిశెట్టి నరేష్, మారాసు వీరేంద్ర, పత్తి మణికంఠ, బండ్ల శ్రీను, ఓబులశెట్టి పిచ్చయ్య, సూరే ప్రసాద్ తిరుమలశెట్టి కొండలు, ఆసా మనోహర్, కందా వెంకటేశ్వర్లు (బాబు), మారాసు కొండలు, తాడి అమర్, నియోజకవర్గ కాపు నాయకులు పాల్గొన్నారు.
బాధిత కాపు కుటుంబానికి
న్యాయం చేయాలి