
ఎన్‌ఎంఎంఎస్ గడువు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడించినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్ www.bre.ap.gov.in అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ అనంతరం సంబంధిత ప్రింటెడ్ నామినల్ రోల్స్‌ను ఈనెల 29వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యాశాఖాధికారి లాగిన్‌లో దరఖాస్తును ఈనెల 31వ తేదిలోగా ధృవీకరించాల్సి ఉందని తెలిపారు. గడువు పొడగింపునకు ఇదే చివరి అవకాశంగా గుర్తించాలని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు నమోదులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదనీ, పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుం ఓసీ, బిసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ వెబ్‌సైట్, డీఈఓ కార్యాలయంలోని డిఎన్‌ఓ పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని తెలిపారు.