
మహిళా, శిశు సంక్షేమశాఖ సక్రమంగా పనిచేయాలి
నరసరావుపేట: జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖను సక్రమంగా పనిచేసేలా చూడాలని, అవసరాన్ని బట్టి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజువారి కార్యక్రమాలు సక్రమంగా ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శాఖాపరమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజు వారి విధులు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, ముఖ్యంగా యుక్త వయస్సు, గర్భిణులు, బాల్యవివాహాలు సమస్యలు జిల్లాలో ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించేందుకు పనిచేయాలన్నారు. పోషణకు దూరమైన పిల్లల్ని గుర్తించి వారి గృహ సందర్శన ద్వారా సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ హాజరు పెంచాలని, జిల్లాలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని జిల్లాలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. జిల్లా సాధికారత అధికారిని ఎం.ఉమాదేవి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓలు కాంతకుమారి, శ్రీలత, శాంతకుమారి, అపరంజి, జ్యోత్స్న, వెంకటరమణ, రాజేశ్వరి, బాల సంక్షేమ సమితి కార్యాలయ సభ్యులు సౌరిరాజు, వన్‌స్టాప్ సెంటర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఆర్టీసీ సేవలు మెరుగు పర్చాలి
జిల్లాలో ఆర్టీసీ సేవలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులపై మహిళలకు ఉచితం అని స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో సౌమ్యంగా ప్రవర్తించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సమయపాలనతో బస్సులు నడపాలన్నారు. జిల్లాలోని పలు జెడ్పీ పాఠశాలలు, జూనియర్ కళాశాలకు మారిన టైమింగ్స్ ప్రకారం బస్సులు నడపాలన్నారు. బస్టాండ్లలో తాగునీరు, టాయిలెట్లు వసతులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అజితకుమారి, డీఈవో చంద్రకళ, పలు డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా