
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.