
విద్యుత్ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
● నరసరావుపేట మండలంలో
4219 సర్వీసులు పరిశీలన
● రూ.5.66లక్షల అపరాధ
రుసుము విధింపు
నరసరావుపేట: విద్యుత్ పంపిణీ విభాగంలోని డీ–3 సెక్షన్‌లో 4219 సర్వీసులు తనిఖీ చేసి రూ.5.66లక్షల అపరాధ రుసుం విధించినట్లు విద్యుత్ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం అధికారులు వెల్లడించారు. బుధవారం బరంపేటలోని విద్యుత్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీరు డాక్టర్ పి.విజయకుమార్ ఆధ్వర్యంలో నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, చింతలపాలెం, అర్వపల్లి, అల్లూరివారిపాలెం, అచ్చంవారిపాలెం, గోనెపూడి, దొండపాడు, ఇక్కుర్తి, జొన్నలగడ్డ, కాకాని, కేశానుపల్లి, కోటప్పకొండ, కొత్తపాలెం గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేశామని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్‌ఏ కరీమ్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సీహెచ్ రాంబొట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 53 మంది అధికారులు, 159మంది సిబ్బంది 53 బృందాలుగా ఏర్పడి సర్వీసులను తనిఖీ చేశారన్నారు. మీటరు లేకుండా డైరెక్ట్‌గా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 24మందిని గుర్తించి వారి వద్ద నుంచి రూ.35వేలు, మీటరు ఉన్నా చౌర్యానికి పాల్పడుతున్న తొమ్మిది మంది వద్ద నుంచి రూ.1.30లక్షలు, అనుమతించిన కేటగిరీ కాకుండా ఇతర కేటగిరీలలో విద్యుత్ వాడుతున్న ఐదుగురికి రూ.47వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుకుంటున్న 81మందిపై రూ.3.54లక్షలు అపరాధ రుసుం విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, చౌర్యానికి పాల్పడుతున్న వారి గురించి 94408 12263, 86397 41050 నెంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందని వెల్లడించారు. ఈ దాడుల్లో ఆపరేషన్ విభాగ డీఈఈ జీఎల్‌వీ ప్రసాదరావు, విజిలెన్స్ డీఈఈ ఎస్.శ్రీనివాసరావు, కె.రవికుమార్, ఎన్.మల్లికార్జునప్రసాదు, ఆపరేషన్ విభాగ ఏఈ కె.రాంబాబు, విజిలెన్స్ విభాగం ఏఈఈలు కె.కోటేశ్వరావు, ఎం.సతీష్‌కుమార్, యు.శివశంకర్ పాల్గొన్నారు.