
ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్ విడుదల
లక్ష్మీపురం: ఏపీఐఐసీ – ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు (పార్టన్నర్ షిప్ సమ్మిట్)లో భాగంగా ఈ పోస్టర్ విడుదల చేశామని తెలిపారు. పీసీబీ కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.డి.నజీనా బేగం, ఏపీఐఐసీ జీఎం డాక్టర్ ఎం.ఎల్ నరసింహారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎ. జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ మంగళగిరి అడిషనల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కమ్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్ ఎం.ప్రసన్న లక్ష్మి బుధవారం వెలువరించారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలంలోని నూతక్కి గ్రామానికి చెందిన ఓ యువతి 2019లో ఇంటి వద్ద స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బోళ్ల వెంకటరెడ్డి తొంగిచూశాడు. ఆమె గమనించి ఇంట్లోకి వెళ్లారు. అతడూ వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితుడు పరారయ్యాడు. మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు దర్యాప్తు అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ఎ.శివలీల ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
తెనాలిరూరల్: తెనాలిలో కలకలం సృష్టించిన హత్య కేసును పోలీసు ఛేదించినట్టు సమాచారం. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితుడిని గుర్తించినట్టు తెలిసింది. గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరు ఉన్న వరుసకు అల్లుడయ్యే వ్యక్తే హత్యకు ప్పాడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
సత్తెనపల్లి: వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని సంఘం బజార్‌కు చెందిన చెందిన లఘువరపు హనుమంతరావు(52) వెంకట భాను జనరల్‌స్టోర్ నిర్వహిస్తుంటాడు. ఆయనకు భార్య శైలజ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత 8 నెలలుగా సోదరుడి కుమారుడు లఘువరపు రమేష్, బావమరిది దరివేముల రామకృష్ణతో వ్యాపార, కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సోదరుడి కుమారుడైన రమేష్ అడ్డుతగలడం, కుటుంబం విషయంలో బావమరిది రామకృష్ణ ప్రమేయంతో మనస్థాపం చెందిన హనుమంతరావు ఈ నెల 12న గడ్డి మందు కొనుక్కొని తన దుకాణంలో తాగి ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద వాంతులు చేసుకోవడంతో భార్య శైలజ గమనించి హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. చికిత్స పొందుతూ హనుమంతరావు బుధవారం మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పట్టణ ట్రైనీ ఎస్‌ఐ యష్న మృతుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.