
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. టిఫిన్ బండి వద్ద ఉన్న వ్యక్తిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి దుండగుడు హతమార్చాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి (60) గ్రామంలోని తమ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గండికోట దుర్గ తెనాలి చెంచుపేటలోని ఎమ్మెల్యే బజారులో ఉంటోంది. బుజ్జి పది రోజుల క్రితం కుమార్తె వద్దకు వచ్చాడు. బైక్‌పై టిఫిన్ బండి వద్దకు మంగళవారం ఉదయం వెళ్లాడు దోశలు ఆర్డరిచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంతలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తిరుపతిరావుపై దాడి చేసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడని, హత్యానంతరం తన వాహనంపై వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు, ఎస్‌ఐ కరిముల్లా తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారణమేంటి?
పాత కక్షలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కోరుతాడిపర్రు గ్రామంలో ఆలయానికి సంబంధించిన నగదు పాట నిర్వహించడం, ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ వంటివి బుజ్జి చూస్తుంటాడు. అమృతలూరు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆలయ వ్యవహారం ఏళ్లుగా ఒక్కరే చూడాలా అంటూ గ్రామానికే చెందిన అల్లుడు వరుస అయ్యే వ్యక్తి ఇటీవల బుజ్జితో వాగ్వాదానికి దిగాడని, అలాగే తన తండ్రి మృతికి తిరుపతిరావు కారణమంటూ గతంలో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. అతనే ఈ హత్య చేసి ఉంటాడని అటు గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. మరో వైపు తిరుపతిరావు మనవరాలికి ఆమె భర్తకు మధ్య కుటుంబ కలహా లు ఉన్నాయి. మూడు రోజులుగా తెనాలి చెంచుపేటలో ఈ పంచాయితీ వ్యవహారం నడుస్తోంది. కుటుంబ కలహాలకు తిరుపతిరావే కారణమని, అతడిని హతమారిస్తే కలహాలు ఉండవంటూ మనవరాలి భర్త సోమవారం రాత్రి హెచ్చరించాడని చెబుతున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరులో అల్లుడి వరుస అయ్యే వ్యక్తి లేదా మనవరాలి భర్త ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిద్దరూ ఒక్కటై హత్య చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

పట్టపగలే వ్యక్తి దారుణ హత్య