
టిడ్కో ఇళ్లు పంపిణీకి సిద్ధం
23న లబ్ధిదారులకు స్వాధీనం చేస్తాం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: మున్సిపాలిటీ పరిధిలో 199 టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కలెక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోగల టిడ్కో హౌసింగ్ కాలనీ, వినుకొండరోడ్డులోని జగనన్నకాలనీలను సందర్శించారు. టిడ్కో గృహ సముదాయంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 23 నాటికి మరిన్ని ఇళ్లను జతచేసి 200కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నామని చెప్పారు. స్వాధీన పరుచుకున్న ఇళ్లలో ఖచ్చితంగా ఎవరో ఒకరు నివాసం ఉండేలా చూడాలని లబ్ధిదారులను కోరారు. నివాసం లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు కాలనీలు నెలవుగా మారే అవకాశం ఉంటుందన్నారు. కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న మరో 270 ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాలు మంజూరు కాని 300 మందికి పైగా లబ్ధిదారులకు అన్ని బ్యాంకుల ద్వారా క్యాంపు ఏర్పాటుచేసి రుణాలు మంజూరు చేసి మరీ ఇళ్లు స్వాధీనం చేస్తామన్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్న ఇళ్లకు 23 నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారుల నుంచి కాలనీలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వీధిదీపాలకు సాయంత్రంలోగా మరమ్మతులు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో టిడ్కో కాలనీ తీర్చిదిద్దామని దీనికి కృషిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ మిగిలిన వారికి కూడా టిడ్కో గృహాలను స్వాధీనం సత్వరమే చేయాలని కోరారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలో సమస్యలు పరిష్కరించండి
వినుకొండ రోడ్డులోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్ (జగనన్న కాలనీ)లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాలనీలో పర్యటించిన ఆమెకు కాలనీ ఏర్పాటు, అందులోని పరిస్థితులను ఎమ్మెల్యే, అధికారులు వివరించారు. రహదారులు బాగాలేవని, మురుగు కాలవల నిర్మాణం చేపట్టాలని, విద్యుత్తు లైన్లను వేయించాలని స్థానికులు కోరారు. ఆ సమస్యలు విన్న కలెక్టర్ తహసీల్దారు, పంచాయతీ అధికారులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, అధికారులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.