
న్యాయమైన పరిహారం అందజేస్తేనే భూములు ఇస్తాం
నరసరావుపేట రూరల్: న్యాయమైన పరిహారాన్ని అందజేస్తేనే భూ సేకరణకు సహకరిస్తామని కేసానుపల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. చీరాల ఓడరేవు–నకరికల్లు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం శుక్రవారం కేసానుపల్లి గ్రామ రైతులతో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమావేశం నిర్వహించారు. సమావేశానికి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ.80 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని జేసీ తెలిపారు. జేసీ ప్రతిపాదనకు భూ నిర్వాసితులు అంగీకరించలేదు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో ప్రకటించిన విధంగా ఎకరానికి రూ.1.60 కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు. గ్రామానికి చెందిన 42 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, ఇందులో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని వివరించారు. ఆ భూములనే నమ్ముకున్న రైతులు భూసేకరణ ద్వారా జీవనాధారం కోల్పోతారని పేర్కొన్నారు. గతంలో చెప్పిన పరిహారంలో సగం ధరకే ఇప్పుడు భూములు ఇవ్వాలని అధికారులు చెప్పడాన్ని తప్పుపట్టారు. న్యాయమైన పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ రైతులను అధికారులు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామినేని రామారావు, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావులు పాల్గొన్నారు.