
ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వీరరాఘవయ్య
రేపల్లె: విద్యార్థి దశ నుంచే ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రేపల్లె బ్రాంచి చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య సూచించారు. ప్రథమ చికిత్స, సీపీఆర్‌లపై పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుంటూరు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరరాఘవయ్య మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారు వైద్యశాలకు వెళ్లేలోపు ప్రథమ చికిత్స వల్ల కొంత మేర వైద్యం అందుతుందని, దీనివల్ల రక్షణ లభిస్తుందని తెలిపారు. ఎవరైనా గుండెపోటుకు గురైతే వైద్యశాలకు వెళ్లే ముందు సీపీఆర్ అందిస్తే అతను బతికేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వివిధ సందర్భాల్లో గాయపడిన వ్యక్తులకు అందించే ప్రథమ చికిత్సలు, గుండెపోటు వచ్చిన సమయంలో అందించే సీపీఆర్‌ని గుంటూరు రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన డాక్టర్ రసూల్ బృంద సభ్యులు ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీసీ రవిచంద్రకుమార్, కోఆర్డినేటర్ బుజ్జిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో ఆర్‌కే నారాయణ్ జయంతిని నిర్వహించారు. ఆయన సాహితీ సేవలను విద్యార్థులకు వివరించారు.
ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం
ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు బాలికా హక్కులు, సమాన అవకాశాలు, శక్తి వికాసంపై వ్యాస రచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శక్తి వికాస్ సెల్ ఇన్‌చార్జ్ సుభాషిణి, సీడీపీవో సుచిత్ర, సీఆర్‌ఏఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ హిమబిందు, టి.రాధిక, విద్యార్థినులు పాల్గొన్నారు.