
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
●దానికి బదులు అమరావతి ప్రైవేటీకరణ చేయొచ్చు కదా?
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల
పిడుగురాళ్లరూరల్: రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్లతో జేబులు నింపుకొంటూ, పేదల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొని వచ్చిన వైద్యకళాశాల, హాస్పటళ్లను ప్రైవేటుకు అప్పగించడం ఏంటని.. ఇదేనా మీ విజనరీ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. శ్యామల మాట్లాడుతూ... 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి బడ్జెట్టులోనే గురజాల నియోజకవర్గానికి నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు, రోగులకు ఉపయోగపడే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను ప్రైవేటు పరం చేస్తుందని.. దానికి బదులుగా అమరావతిని ప్రైవేటీకరణ చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత పెద్ద ప్రజెంటేషన్ చేసి కాలేజీల నిర్మాణం చేపట్టలేదని చెబుతున్నారని, అయితే ఒక్కసారి గురజాల వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మెడికల్ కాలేజీ భవనాలను కళ్లతో చూస్తూ కూడా నోటితో అబద్దాలు చెబుతున్నారని శ్యామల దుయ్యబట్టారు. 17 కాలేజీలలో ఏడు కాలేజీలను జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారని, మిగతా 10 కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం రాజధాని ఎలా పూర్తి చేస్తారని ఆమె ప్రశ్నించారు. సర్పంచ్‌లు చల్లా శివారెడ్డి, షేక్ బడేషా, వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ఇల్లూరి వెంకట రామిరెడ్డి, జిల్లా యూత్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ చల్లా రంగారెడ్డి, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ షేక్ మాబు, గురజాల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సాంబశివరావు, వలంటీర్ విభాగం అధ్యక్షులు అంచూరి తరుణ్‌రెడ్డి, కత్తి సాగర్‌బాబు, బండి ప్రసాద్‌రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.