
జిల్లాలో భూగర్భజలాలు సంరక్షించాలి
నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెంపు వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, భూగర్భజల శాఖ, డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట కుంటల తవ్వకం, చెక్ డ్యామ్‌లు, నీటికుంటల నిర్మాణం, చెరువుల పూడికతీత, చెరువుల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపటం వంటి సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా నీటి సంరక్షణ సాధ్యమన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ , డ్వామా పీడీ లింగమూర్తి, మైనర్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు వసతులు కల్పించండి
ఔత్సాహిక క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలసి సత్తెనపల్లిరోడ్డులోని అన్నా క్యాంటీన్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా స్టేడియానన్ని ఆమె పరిశీలించారు. వాకింగ్, రన్నింగ్ ట్రాక్‌లతోపాటు వివిద నిర్మాణాలు చేపట్టాలని శాప్ అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్‌లో భోజనాన్ని పరిశీలించారు. ప్రకాష్‌నగర్‌లోని 12వ వార్డు షాలెంనగర్‌లో మురుగునీటి కాలువను పరిశీలించారు. పూడికతీతకు ఆదేశాలిచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును ఆదేశించారు. బాపనయ్య 11వ వార్డు సచివాలయాన్ని పరిశీలించారు. నూతన జీఎస్టీ రెండు శ్లాబుల విధానంతో అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీఓ కె.మధులత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం