
ఎన్‌జీజీఓ ఎన్నికలు వెంటనే పూర్తిచేయండి
నరసరావుపేట: ఏపీ ఎన్‌జీజీఓ పల్నాడు జిల్లా శాఖ ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అడహాక్ కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో అడహాక్ కమిటీ చైర్మన్ రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని తాలూకా యూనిట్ల ఎన్నికల ప్రక్రియ గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యదర్శి ఎస్.శ్యాంసుందర శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని తాలూకా యూనిట్ల సభ్యత్వాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, అడహాక్ కమిటీ సభ్యులు, తాలూకా యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరులో వైద్యుల షటిల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం విజయవంతంగా జరిగాయి. గుంటూరు అమరావతి రోడ్డులో జరిగిన షటిల్ టోర్నమెంట్‌లో వంద మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతగా శ్రీసూపర్‌కింగ్స్ నిలిచారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.కళ్యాణ్ చక్రవర్తి కెప్టెన్‌గా ఆడిన షటిల్ టోర్నమెంట్‌లో కార్డియాలజిస్ట్ డాక్టర్ బి.వి.నారాయణరెడ్డి, స్పైన్ సర్జన్ డాక్టర్ డి.శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ రాజశేఖర్‌లు టీమ్‌గా ఆడి కప్పు గెలుచుకున్నారు. ఫైనల్‌లో సందీప్ స్టైకర్స్ టీమ్‌ను 3.1 తేడాతో ఓడించి శ్రీసూపర్ కింగ్స్ విజేతగా నిలిచారు. శ్రీ సూపర్ కింగ్స్ టీమ్ వైద్యులకు పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృష్టి చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న డాక్టర్ ధాత్రికుమారి జాషువా సాహిత్య పురస్కారానికి అర్హురాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విశ్వ నరుడు జాషువా సేవా సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో విశ్వకవి గుర్రం జాషువా 130 వ జయంతి ముగింపు సభ లో భాగంగా మంగళవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో డాక్టర్ ధాత్రికుమారికి జాషువా సాహితీ పురస్కారం అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాషువా సాహిత్యం అజరామరం అన్నారు. కుల దురహంకారం పై, మహిళా అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జాతీయ కవి అని కొనియాడారు. సభకు సంస్థ అధ్యక్షుడు ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో టి. మహతి బాలాజీ, ఆర్. నరసింహారావు, ఎ. కిరణ్, ప్రభుదాసు కే రామారావు, ఐ. నరసింహారావు, కే. విల్సన్ రావు తదితరులు పాల్గొన్నారు.
దాచేపల్లి: మండలంలోని రామాపురం మత్స్యకారుల కాలనీ రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. మంగళవారం కూడా కృష్ణానది వరద ఉధృతి తగ్గలేదు. దీంతో కొంత సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరికొన్నింటిని ఇళ్లపై భద్రపరిచారు. వరద ఉధృతి తగ్గకపోవటంతో పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. వరదకు పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. మండలంలోని పొందుగల వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా పొలాలు నీట మునిగాయి.

ఎన్‌జీజీఓ ఎన్నికలు వెంటనే పూర్తిచేయండి

ఎన్‌జీజీఓ ఎన్నికలు వెంటనే పూర్తిచేయండి