
మద్యం మత్తులో కారుతో హల్‌చల్
బొలెరోతో అడ్డొచ్చిన వారిని ఢీకొన్న వాహనదారుడు
నలుగురికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అర కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన వైనం
పట్టుకుని దేహశుద్ధి చేసి
పోలీసులకు అప్పగించిన స్థానికులు
పిడుగురాళ్ల: మద్యం మత్తులో బొలెరో వాహనాన్ని నడుపుతూ వాహనాలు, పాదచారులపైకి దూసుకుపోయిన ఘటన పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం.. సైదా వలి అనే యువకుడు పూటుగా మద్యం తాగి బొలెరో వాహనం నడుపుతూ దాచేపల్లి వస్తున్నాడు.. ఈక్రమంలో పిడుగురాళ్ల అయ్యప్పనగర్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాల తో పాటు పాదచారులపైకి దూసుకుపోయాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన యువకుడు హైవేపై కొద్ది నిమిషాల పాటు హల్‌చల్ చేశాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం నిలిపి పక్కన మాట్లాడుతున్న వ్యక్తిని బొలెరోతో ఢీకొనడమే కాకుండా ఆ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లాడు. వేగంగా వాహనం దూసుకుని పోవడంతో రోడ్డుపై నిప్పు రవ్వలు చెలరేగాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిలో నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తికి కాలు పూర్తిగా దెబ్బతింది. అతన్ని వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు తెలిసింది. మిగిలిన వారిని పిడుగురాళ్ల పట్టణంలో ప్రైవేట్ హాస్పటల్‌లో చేర్పించారు. ఈక్రమంలో ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పలువురు యువకుల సాయంతో బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సైదావలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వారిని 108 ద్వారా పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో అద్దంకి –నార్కెట్‌పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వాహనం నడిపిన సైదావలిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివ నాగరాజు తెలిపారు.

మద్యం మత్తులో కారుతో హల్‌చల్