
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
నరసరావుపేట టౌన్: న్యాయపరమైన డిమాండ్‌లు పరిష్కరించి వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీహెచ్‌సీ వైద్యుల సంఘం అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ కోటా తగ్గించింటంతో వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ జీఓ నెం. 99 ద్వారా పీజీ ప్రవేశాల్లో 20 శాతం ఉన్న కోటాను 15 శాతానికి తగ్గించటమే కాకుండా కేవలం ఏడు బ్రాంచ్‌లకే పరిమితం చేయటం అన్యాయమన్నారు. సంఘ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మొదట దీక్ష శిబిరం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు హనుమకుమార్, రమ్య, జగన్‌నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.