
జిల్లాకు 2140 మెట్రిక్‌టన్నుల ఎరువుల కేటాయింపు
నాదెండ్ల: పల్నాడు జిల్లాకు 2140 మెట్రిక్ టన్నుల ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా వ్యవసాయాధికారి ఎం జగ్గారావు చెప్పారు. ఈ మేరకు ఆదివారం సాతులూరు రైల్వే ఎరువుల రేక్ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. ఎంసీఎఫ్ యూరియా 560 మెట్రిక్ టన్నులు, 20–20–0–13 ఎరువులు 520 మెట్రిక్ టన్నులు, సీఐఎల్‌డీఏపీ 1060 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఎరువులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. రైతులకు ఎరువులు అందేలా స్ధానిక వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు వెళ్లకుండా నియంత్రించాలని ఆదేశించారు. ఆయనతోపాటు ఏడీఏ శ్రీనివాసరావు, స్థానిక ఏవో శ్రీలత, సిబ్బంది శ్రీనివాసరావు ఉన్నారు.
బాపట్ల టౌన్: బాపట్ల, నగరం మండలాల్లో ఈనెల 16,17 తేదీల్లో స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సెక్రటరీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. బీచ్ వాలీబాల్ పోటీల ఎంపిక బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో, తైక్వాండో పోటీలకు ఎంపిక నగరం మండలంలోని ఉలిపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–14 పోటీలకు విద్యార్థులు 1–1–2012 తర్వాత, అండర్ –17 పోటీలకు విద్యార్థులు 1–1–2009 తర్వాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ఎంట్రీ ఫామ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నికల్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు అనర్హులని పేర్కొన్నారు.
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలోని భవానీ సెంటర్‌లో ఆదివారం జరిగింది. ఎన్టీర్ కాలనీకి చెందిన యర్రమోతు అంజయ్య బైకుపై పట్టణంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో భవానీ సెంటర్‌లో శింగరకొండ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.

జిల్లాకు 2140 మెట్రిక్‌టన్నుల ఎరువుల కేటాయింపు