
కారు బీభత్సం
మద్యం మత్తులో కారులోని యువకులు స్కూటీ, ఆటోలను ఢీకొట్టిన వైనం ఆరుగురికి తీవ్ర గాయాలు
జాతీయ రహదారిపై
చీరాల అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఆదివారం 216 జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. చిలకలూరిపేటకు చెందిన యువకులు ఆదివారం రామాపురం సముద్రతీరానికి వచ్చారు. మద్యం తాగి సాయంత్రం రామాపురం నుంచి జాతీయ రహదారిపైకి కారులో వేగంగా వచ్చారు. ద్విచక్రవాహనంపై వస్తున్న వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన వ్యక్తిని ఢీకొని ఆగకుండా వెళ్లిపోయారు. అదే వేగంతో హాయ్ రెస్టారెంట్ వద్ద ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న రామానగర్‌కు చెందిన ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగ నియంత్రణ కాకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు ఆటోలో గాయాలపాలైన యువకులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులకు ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగభూషణం తెలిపారు.

కారు బీభత్సం