
కృష్ణా నదిలో పెరిగిన వరద ప్రవాహం
కొల్లూరు : కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సుంచి దిగువ సముద్రంలోకి నీటిని విడుదల చేస్తుండటంతో మండలంలో కృష్ణా నదిలో వరద తీవ్రత పెరిగింది. నది నిండుగా ప్రవహిస్తోంది. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.87 లక్షల నీటిని ఆర్‌సీ అధికారులు దిగువకు విడుదల చేశారు. అనంతరం నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో జిల్లాలోకి వరద నీటి తాకిడి తగలనుండటంతో గణనీయంగా నదిలో నీటి మట్టం అర్ధరాత్రి అనంతరం పెరిగే సూచనలున్నాయి. తీర ప్రాంత గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు, చిన్నారులు నదిలోకి దిగరాదని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద తీవ్రత అధికమైతే పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళనలో రైతులు ఉన్నారు. ఎగువ ప్రాంతాలో వర్షాలు కురవకుండా ఉంటే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు మున్నేరు తదితర వాగుల ద్వారా కూడా ప్రకాశం బ్యారేజ్ వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టే సూచనలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 3.50 లక్షల వరకు కృష్ణా నదికి వరద నీటి విడుదల ఉండవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చారు.