
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు బాధ్యతల స్వీకరణ
నరసరావుపేటరూరల్: జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. జిల్లా ఎస్పీగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న కృష్ణారావుకు అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అడిషనల్ ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి ఇతర అధికారులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన, శాంతిభధ్రతల పరిరక్షణ, ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి పోలీసు శాఖ పట్ల ప్రజలకు సానుకూల వాతావరణాన్ని కల్పించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సైబర్ నేరాలను నియంత్రించి మెరుగైన సేవలను ప్రజలకు అందిస్తామని తెలిపారు.