
ప్రజా ప్రయోజనాలే నాకు ప్రథమం
నూతన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కుటుంబ సభ్యులతో కలసి బాధ్యతల స్వీకారం స్వాగతం పలికిన జేసీ, అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వాగతం పలికిన పూర్వ కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: ప్రజలు, ప్రజా ప్రయోజనాలే ప్రథమం అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టరుగా కుటుంబ సభ్యుల మధ్య ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఇతర జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికా రు. పూజారులు మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథ కాలు సక్రమంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. 2016–18 కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా పల్నాడు ప్రాంతంలో చేసిన పర్యటనలు తనకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమెకు పూర్వ కలెక్టర్ పి.అరుణ్‌బాబు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను జిల్లా అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పలువురు రాజకీయ, కులసంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.