ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):వారాంతం, రెండో శనివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భారీ సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు అమ్మవారికి నిర్వహించిన పలు విశేష పూజల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంతో పాటు హోమాలలో ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంటపాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనంతోపాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్ల భక్తులు బారులు తీరి కనిపించారు.