
ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఎ.శాస్త్రి అధ్యక్షతన శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిథి గోపిమూర్తి మాట్లాడుతూ.. ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షలుగా ఉన్న ఈపీఎస్ పెన్షనర్లకు సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి శాసనమండలిలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.మోహనన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెన్షనర్లు పీఆర్‌సీ లబ్ధి పొందకుండా పెన్షన్ రీవాల్యుడేషన్–2025 బిల్లును తీసుకురావడం అన్యాయమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెన్షనర్లు అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తీర్మానాలను ప్రవేశపట్టి భవిష్యత్ కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పెన్షనర్లు తరపున ఎమ్మెల్సీ గోపిమూర్తికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సదస్సులో బ్యాంకు పెన్షనర్స్ సంఘం నాయకుడు ఎం.రామారావు, రైల్వే పెన్షన్ సంఘం నాయకుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.