
నిర్లక్ష్యం.. ప్రస్ఫుటం
● 14 నెలలుగా ఒక్క రూపాయి విడుదల చేయని కూటమి ప్రభుత్వం ● కళాశాలలో నిలిచిన అభివృద్ధి పనులు ● హాస్టళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి ● కళాశాలలో వసతులు పరిశీలన
నరసరావుపేట రూరల్: జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు విడుదల చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాకానిలోని కళాశాలను మంగళవారం డాక్టర్ గోపిరెడ్డి సందర్శించి, క్యాంపస్‌లోని భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు నిలిచిపోయిన విద్యార్థుల వసతి గృహాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ 2014లో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కృషితో కాకాని వద్ద జేఎన్‌టీయూఎన్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఇందుకు గాను 84 ఎకరాలు కేటాయించినట్టు తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 వరకు క్యాంపస్‌లో కనీసం ఇటుక కూడా వేయలేదన్నారు. క్యాంపస్‌లో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించి టెండర్లు పిలిస్తే పనులు చేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు.
హాస్టళ్ల నిర్మాణంపై శ్రద్ధ ఏదీ?
హాస్టల్ భవన నిర్మాణానికి కేవలం రూ.10 కోట్లు చాలని, వాటిని కూడా విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. కళాశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వీరంతా పట్టణంలోని ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ కళాశాలకు రావాల్సి వస్తుందన్నారు. కళాశాలలో నిర్మాణంలో ఉన్న హాస్టళ్లు పూర్తయితే నాలుగు బ్లాక్‌ల్లో 700 గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి..
కళాశాలలో 1200 మంది విద్యార్థులకు 13మంది రెగ్యులర్ టీచింగ్ స్టాప్ మాత్రమే ఉన్నారంటే విద్యా బోదన ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 44మంది గెస్ట్ లెక్చరర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. టీచింగ్ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
కళాశాలకు ముఖ్యమైన హాస్టల్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా స్థానిక ఎమ్మెల్యే వర్సిటీ వీసీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అవసరమైతే వీసీని క్యాంపస్‌కు పిలిపించి మాట్లాడాలని తెలిపారు. అప్పటి వరకు విద్యార్థులను కళాశాలకు చేరవేసేందుకు ఏర్పాటుచేసిన బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. అభివృద్ధికి కృషిచేయకుండా కళాశాలలో ఉద్యోగాలు తమ వారికే కావాలని ఎమ్మెల్యే అడగడం బాధాకరమన్నారు. గోపిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పదముత్తం చిట్టిబాబు, దొండపాడు సర్పంచ్ జెక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ దండా వీరాంజనేయులు , కనకా పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
జేఎన్‌టీయూఎన్‌లో నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడుతున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.150కోట్లతో అభివృద్ధి
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.150 కోట్లతో క్యాంపస్‌లో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకడమిక్ బ్లాక్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, యువతీ, యువకుల వసతి గృహాలు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో ఒక్క రూపాయి పని కూడా కళాశాలలో నిర్వహించలేదని, ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదని గోపిరెడ్డి తెలిపారు. దీన్నిబట్టి కళాశాల అభివృద్ధిపై కూటమి నేతలకు ఉన్న శ్రద్ధ అర్ధమవుతుందన్నారు.