
అన్నదాతకు అవమానం
దేశానికే అన్నం పెట్టే రైతు మెట్లపై కూలబడ్డాడు.. అధికారులు ఎప్పుడొస్తారో తెలీక.. అందాక కూర్చునే తావు లేక.. మళ్లీ ఎవరైనా కసురుకుంటారేమోనని బెరుకు బెరుకుగా.. మెట్లపై ఓ మూలన కూర్చున్నారు. అటు ఇటు కొందరు అధికారులు తిరుగుతున్నా.. మాకిది మామూలేననుకుంటూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కలెక్టరేట్‌లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు కనిపించిన చిత్రమిది. అడంగల్‌లో తప్పుల సవరణకు తామొచ్చామని.. గత రెండ్రోజులుగా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై కిసాన్.. రైతే రాజు.. అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే నేతలు, అధికారులు చేతల్లో మాత్రం వారిని తీవ్రంగా అవమానిస్తున్నారు. సమయానికి పనులు చేయరు సరికదా.. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా చేసి.. వారిని మెట్లపై కూర్చోబెట్టి అవమానించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. – సాక్షి, నరసరావుపేట