ఈదుపల్లికి విష జ్వరం | - | Sakshi
Sakshi News home page

ఈదుపల్లికి విష జ్వరం

Aug 6 2025 7:04 AM | Updated on Aug 6 2025 7:04 AM

ఈదుపల

ఈదుపల్లికి విష జ్వరం

నగరం: నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి విషజర్వం సోకింది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పాలకులు, అధికారులు స్పందించారు. సోమవారం రాత్రి జిల్లా వైద్యధికారిణి విజయమ్మ ఈదుపల్లి గ్రామంలో పర్యటించారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈదుపల్లి గ్రామంలో నెల రోజుల నుంచి విష జర్వాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులుగాని, అధికారులు గాని స్పందించలేదు. రెండు రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలారు. సరైన సమయంలో వైద్య సిబ్బందిగాని, పంచాయతీ అధికారులు గాని స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్‌

ఈదుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి మంగళవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో మురుగు నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జర్వాలు తగ్గుముఖం పట్టే వరకు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాలు కొనసాగించాలన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి జర్వాలతో బాధపడుతున్న వారికి మెరుగై వైద్యసేవలు అందజేయాలని సూచించారు.

ఇంటింటి సర్వే

ఈదుపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. 450 కుటుంబాలలో సర్వే నిర్వహించగా 56 మందికి జర్వాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి డెంగీ పరీక్ష నిర్ధారణ కోసం శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.

విష జ్వరాలపై

అప్రమత్తంగా ఉండాలి

నగరం: విషజర్వాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జే వెంకటమురళి ప్రజలకు సూచించారు. మండలంలోని ఈదుపల్లి గ్రామంలో మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలు ఉండటంతో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వేలో 56మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మృతి చెందిన మహలక్ష్మికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆమె భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. వైరల్‌ ఫీవర్లు వచ్చిన వారు ఆర్‌ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందాలన్నారు. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని రోజుల తరబడి రోగులకు చికిత్స చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాలక్ష్మికి డెంగీ వచ్చినట్లు గుర్తించని ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో విషజ్వరాలు అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామస్తులు తాగునీటి సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. 15 రోజులలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, డీఎంహెచ్‌ఎం డాక్టర్‌ విజయమ్మ, డీఎల్‌డీఓ పద్మ, డెప్యూటీ సీఈఓ కృష్ణ, తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రెండు రోజుల్లోనే భార్యాభర్తలు మృతి

అనాధలుగా మిగిలిన ఇద్దరు కుమార్తెలు

కదిలిన పాలకులు, అధికార యత్రాంగం

ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది

గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

ఈదుపల్లికి విష జ్వరం 1
1/1

ఈదుపల్లికి విష జ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement