
‘చేనేత’కు అందని చేయూత
చేనేత వస్త్రాలు అంటే జాతీయ స్థాయిలో మంగళగిరికి పేరుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మంగళగిరి నేతన్నలది. ఒకప్పుడు వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు జిల్లాలో 80 వేలకుపైగా ఉన్న మగ్గాలు నేడు 35 వేలకు తగ్గిపోయాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక నేత కార్మికులను గాలికి వదిలేసింది.
మంగళగిరి: నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి అంటే చేనేత గుర్తుకు వచ్చేలా ముఖద్వారంలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. చేనేత సెంటర్‌గా పేరుపెట్టారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వారికి మంగళగిరి అంటే చేనేత అని గుర్తుకు వచ్చేలా ప్రకాశం బ్యారేజి వద్ద నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి కార్మికుడుకి నెలకు రూ.రెండు వేలు చొప్పున ఏటా రూ.24,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లా వ్వాప్తంగా 3,500 కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నాడు రాజీవ్ గృహ కల్ప కాలనీ వద్ద చేనేత షెడ్లు నిర్మించారు. 146 మగ్గాలు ఉచితంగా అందజేసి సుమారు 1,500 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. పాత బస్టాడ్ ప్రగడ కోటయ్య, వైఎస్సార్‌ల పేరిట ఆవరణలో చేనేత భవనాన్ని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించింది. తెనాలి రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయే వారికి చేనేత భవన్‌లో దుకాణాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందింది.
నేడు అంతటా నిర్లక్ష్యమే
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేనేత పరిశ్రమను పూర్తిగా విస్మరించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత భవన్ కట్టిందనే కక్షతో నేటికీ ప్రారంభించలేదు. దీంతో నేత దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో గెలిచి మంత్రి అయిన నారా లోకేష్ ఇప్పటికీ చేనేత పరిశ్రమను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నా ప్రభుత్వం విస్మరించింది. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుడు గుంట మగ్గంలో నేయడానికి కూలీకి వెళ్తే రోజుకు రూ.250 మించి రావడం లేదు. వేసవికాలంలో రూ.150 కే ఈ మొత్తం పరిమితం. సుదీర్ఘకాలం పనిచేస్తే అనారోగ్యం పాలవుతున్నారు.
నాడు కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కూటమి సర్కార్ వచ్చాక తప్పని అష్టకష్టాలు నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు అన్నివిధాలా విఫలం నేడు జాతీయ చేనేత దినోత్సవం
పూట గడవని దుస్థితిలో నేతన్నలు
చంద్రబాబు చేనేత పరిశ్రమకు, కార్మికులు మేలు చేస్తారని ఓటేశాం. మంత్రి లోకేష్ కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ పాలనలో నెలకు రూ.రెండు వేలు చొప్పున వచ్చేవి. బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అయ్యేవి. కార్మికులు సంతోషంగా జీవించేవారు. నేడు ఏ రోజుకా రోజు పని చేస్తేనే పూట గడిచే దుస్థితిలోఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి.
– వెంకటేశ్వరరావు, చేనేత కార్మికుడు

‘చేనేత’కు అందని చేయూత