
ఖరీఫ్‌లో పొగాకు సాగు నిషేధం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట రూరల్: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పొగాకు పంటను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. కలెక్టరేట్ ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు రైతుల సమాయత్తంపై సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా వర్షపాతం నమోదు, సాధారణ పంట సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల లభ్యత, కౌలుదారు హక్కు పత్రాలు, కౌలు రైతులకు పంట రుణాల పంపిణీ తదితర కార్యక్రమాలపై జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రబీ కాలానికి వరి పంట సాగుకు సాగర్ నీరు విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై వ్యవసాయ అధికారులు గ్రామస్థాయికి వెళ్లి రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. ఆగస్ట్ నెలలో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున సరిపడా ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి పదిరోజులకు ప్రైవేటు రిటైల్ డీలర్ షాపులను తనిఖీ చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపేలా రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవాలు
ఘనంగా నిర్వహిద్దాం..
నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర దినోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర వేడుకల సన్నద్ధతపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారని తెలిపారు. డీఆర్‌ఓ మురళి, అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్‌డీఓ మధులత, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.