
బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా బిహార్‌లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ప్రజాస్వామికవాదులు అంతా వ్యతిరేకించాలని, ఇది కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే కుట్రలో భాగమని శాసన మండలి మాజీ సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. గుంటూరు అంబేద్కర్ సెంటర్ (లాడ్జి సెంటర్)లో కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్‌కు వ్యతిరేకంగా సీపీఐ(యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవకపోవటంతో బిహార్ రాష్ట్రంలో ఎలాగైనా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని అక్రమ పద్ధతులకు ఒడికట్టిందని విమర్శించారు. ఓటర్లు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డులు గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని, కానీ బిహార్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు తాత, ముత్తాతల నాటి గుర్తింపు కావాలని ఎన్నికల సంఘం చెపుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వతంత్రంగా వ్యవహరిచాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకొని అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రధానంగా వలస కార్మికులు, మైనార్టీల సుమారు 70 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఇది కేవలం ఒక్క బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తారని, దీనిని ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర కార్యదర్శి కె. నళినీకాంత్, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు అవధానుల హరి, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు సదాశివరావు, సీపీఎం జిల్లా, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
గుంటూరులో నిరసన