
బ్యాంకుల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట రూరల్: బ్యాంకులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతా ప్రమాణాలపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం బ్యాంకు మేనేజర్లు, సెక్యూరిటీ అధికారులతో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీసీ టీవీ కెమెరాల వినియోగం, సెక్యూరిటీ గార్డుల పనితీరు, అలారం సిస్టమ్స్, డబుల్ లాక్ విధానం వంటి సాంకేతిక చర్యలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సూచనలు చేశారు. బ్యాంక్ ప్రాంగణంలో రాత్రి సమయాల్లో లైటింగ్ సౌకర్యం, సెక్యూరిటి గార్డుల పహారా, నగదు రవాణా సమయంలో జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుకంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం బ్యాంకు, పోలీసుల మధ్య సమన్వయం నిరంతరం కొనసాగాలని తెలిపారు. అలాగే జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై చర్చించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, కృతిమ వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాదారుల డేటా భద్రత, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, యూనియన్ బ్యాంక్ ఎల్‌డీఎమ్ కె.రాంప్రసాద్, ఎస్‌బీ సీఐ పి.శరత్‌బాబు, పలు బ్యాంకుల మేనేజర్లు, సెక్యూరిటి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
బ్యాంకుల భద్రత, సైబర్ నేరాలపై
సమావేశం