
పంపిణీపై పచ్చ ముద్ర
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కందిపప్పు, రాగులు, ఇతర తృణధాన్యాలు వంటి సరుకులను రైస్‌కార్డు దారులకు ఇంటి వద్దకే ఎంయూడీ వాహనంలో అందించేవారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎండీయూ వాహన వ్యవస్థలను పూర్తిగా రద్దుచేసి కూటమి కార్యకర్తలకు రేషన్ దుకాణాలను అప్పగించింది. ఇక వారంతా పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకొని డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. బియ్యం అడిగితే లేవంటూ వేలిముద్రలు వేయించుకొని నగదు తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. గట్టిగా అడిగితే అధికారమదంతో బెదిరిస్తున్నారు.
కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులు
మాకు డబ్బులు వద్దు బియ్యమే కావాలంటూ ఎవరైనా రైస్‌కార్డు దారులు రేషన్ పంపిణీ కేంద్రాలకు వెళితే వారికి చుక్కలు చూపిస్తున్నారు. సమయపాలన లేకుండా ఎప్పుడు ఉంటారో, ఎప్పటి వరకు ఇస్తారో తెలియకుండా చేస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థ పనితీరుపై కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలలో కార్డుదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్డుదారులతో రేషన్ దుకాణాల నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు చెబుతున్నారు.
ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు
జిల్లాలో ఒక్కో ప్రాంతంలో కేజీ రేషన్ బియ్యానికి ఒక్కో రేటు కార్డుదారులకు ఇస్తున్నారు. ఇది రూ.8 నుంచి రూ.14 దాకా ఉంటోంది. ముఖ్యంగా నరసరావుపేట లాంటి పట్టణాలలో ఎక్కువమంది దుకాణదారులు రూ.8 ఇస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు రైస్‌కార్డు పొందే అర్హత లేదని, కార్డు తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో చేసేదేమిలేక ఇచ్చింది తీసుకొని వెనుతిరుగుతున్నారు. పల్లెల్లో మాత్రం రూ.12 నుంచి రూ.14 వరకు అందజేస్తున్నారు. డీలర్లు రేషన్ మాఫియాకు రూ.18 నుంచి రూ.20 దాకా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.
నచ్చని వారిపై అధికారులతో దాడులు
రేషన్ దుకాణాలలో బియ్యం కార్డుదారులకు ఇవ్వకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నా పౌర సరఫరాలశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రేషన్ డీలర్లపై విమర్శలొస్తున్నా ఆ శాఖ పట్టించుకోలేదు. ఆయా దుకాణాలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు అందుతున్నా కూటమి నేతల ఒత్తిళ్లతో మిన్నుకుండిపోతున్నారు. అధికారం రాగానే రేషన్ డీలర్లను బెదిరించి కూటమి నేతలు ఆయా షాపులను లాక్కొన్నారు. ఎన్నోఏళ్లుగా చేస్తున్న కొందరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కోర్టులకు వెళ్లి తమ డీలర్‌షీప్‌ను కాపాడుకుంటున్నారు. అటువంటి వాటిపై కూటమి నేతలు అధికారులను పంపి కక్షపూరితంగా దాడులు నిర్వహించి 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. మాపై వచ్చిన ఫిర్యాదులు చెప్పమంటే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉందని దుకాణాలను వదిలేయమని సలహాలిస్తున్నారు.
● గత వారం రోజులుగా వినుకొండ నియోజకవర్గంలో ఈ తరహా దాడులు అధికమయ్యాయి. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేసి వదిలేస్తున్నారు. గోదాముల్లో పెద్దసంఖ్యలో రేషన్ బియ్యం దొరికిన సమయంలో కేసులు నమోదు చేస్తున్నామని మీడియాకు సమాచారం ఇస్తున్నారు తప్ప ఆ తరువాత వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారన్నది చిదంబర రహస్యంగా మారుతోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చూడాలని పేదలు కోరుతున్నారు. రేషన్ డీలర్ల అక్రమాలకు అడ్డుకోట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తూకంలో భారీ మోసం
తూకాలలో మోసాన్ని బహిరంగా చేస్తున్నా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం మాకు కోటా తక్కువగా ఇస్తోందని, ఇచ్చిన కొలతలతో తీసుకోవాలని, నచ్చకపోతే నగదు తీసుకొని పోవాలని హెచ్చరిస్తున్నారు. 20 కిలోలు ఇవ్వాల్సిన వారికి 18 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. రెండు కిలోలు తగ్గాయని ప్రశ్నిస్తే నగదు తీసుకుంటే 20 కిలోలకు నగదు ఇస్తామని చెబుతున్నారు. డీలర్లతో వాదించలేదని పేదలకు తినడానికి వారు ఇచ్చిన బియ్యాన్ని భుజాన వేసుకొని నిరాశతో వెనుతిరుగుతున్నారు.
మొత్తం రైస్ కార్డులు 6,34,893
జిల్లాలో చౌక దుకాణాలు 1289
అందుతున్న
సరుకులు : బియ్యం (అరకొరగా)
బలవంతంగా వేలిముద్రలు..నగదు పంపిణీ
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కూటమి ప్రభుత్వంలో బియ్యం బదులు నగదు డోర్ డెలివరీ ఇంటికొచ్చి కార్డుదారుల వేలిముద్ర వేయించుకొని నగదు పంపిణీ దుకాణాల వద్ద బియ్యం బదులు నగదు తీసుకోవాలని ఒత్తిడి లేదంటే కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులు బియ్యమే కావాలన్నవారికి తక్కువ తూకాలతో పంపిణీ ఐవీఆర్‌ఎస్ సర్వేలో రేషన్ పంపిణీపై తీవ్ర అసంతృప్తి
ఇంటింటికీ రేషన్ మాఫియా
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు ఇంటింటికి రేషన్ డీలర్లు వస్తున్నారు. అయితే వారు వస్తున్నది సరుకులు ఇవ్వడానికి కాదు.. ఇంటి వద్దే వేలిముద్రలు వేయించుకొని నగదు అందజేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడానికి. పోర్టబులిటీ సౌకర్యం ఉండటంతో కార్డుదారులు ఏ షాపులోనైనా సరుకులు తీసుకోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని పట్టణాలలో రేషన్‌డీలర్లు ఇంటింటికి తిరిగి కార్డుదారులతో వేలిముద్రలు వేయించుకొని నగదు అందజేస్తున్నారు. కేజీ బియ్యానికి రూ.8 నుంచి రూ.10 వరకు అందజేస్తున్నారు. వారికి పంచాల్సిన బియ్యాన్ని రేషన్ మాఫియాకు కిలో రూ.18 నుంచి రూ.20కు అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో రేషన్ పంపిణీ తీరు

పంపిణీపై పచ్చ ముద్ర

పంపిణీపై పచ్చ ముద్ర