
ఎరువుల పంపిణీలోనూ వివక్ష
నరసరావుపేట: రాష్ట్రంలో రైతులకు పార్టీల పేరుతో ఎరువులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఘోరంగా అవమానిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి విడుదల రజిని, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి రైతులకు కావాల్సిన యూరియూను తక్షణమే అందుబాటులోకి తీసుకొని రావాలని, రైతులందరికీ సమానంగా ఎరువులను పంపిణీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మాదిగ, గిరిజన కార్పొరేషన్ మాజీ డైరక్టర్లు కందుల ఎజ్రా, పాలపర్తి వెంకటేశ్వరరావు, భవనం నరిసిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులకు పార్టీలు అంటగట్టడం దుర్మార్గం యూరియాను బ్లాక్‌లో అమ్మకుండా చర్యలు తీసుకోవాలి త్రీ మెన్ కమిటీ పేరుతో టీడీపీ వారికే ఎరువులు ఇవ్వటం ఘోరం రైతులకు పార్టీ ముద్ర వేయకుండా ఎరువులు అందజేయాలి ఏ పంటకు గిట్టుబాటు ధర ఇస్తారో ప్రభుత్వం తక్షణమే రైతులకు తెలియజేయాలి రైతులపై కూడా రెడ్‌బుక్ అమలు చేస్తున్న ప్రభుత్వం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, బొల్లా తదితరులు
టీడీపీ వారికే ఇస్తున్నారు : గోపిరెడ్డి
డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాకు ఖరీఫ్, రబీ పంటలకు కలిపి మొత్తం 1,20,540 టన్నుల యూరియా అవసరమైతే ఇప్పుటిదాకా సమకూర్చింది కేవలం 23,142 టన్నులు మాత్రమేనన్నారు. మిగిలిన 50 వేల టన్నుల యూరియాను రైతులకు అందజేయాలని పార్టీ తరఫున పల్నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అదేవిధంగా డీఏపీ 51,883 టన్నులు అవసరమైతే కేవలం 9337 టన్నులు మాత్రమే ఇచ్చారని, 3,51,765 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమైతే 62,160 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా ప్రైవేట్ మార్కెట్‌లో బ్లాక్‌లో అమ్ముతున్నారని, ప్రభుత్వ సొసైటీలో కూడా చూస్తే, త్రీమెన్ కమిటీ పేరుతో టీడీపీ వారికే ఇస్తున్నారన్నారు.

ఎరువుల పంపిణీలోనూ వివక్ష