మృత్యుకుహరాలు గ్రానైట్‌ క్వారీలు | - | Sakshi
Sakshi News home page

మృత్యుకుహరాలు గ్రానైట్‌ క్వారీలు

Aug 5 2025 6:38 AM | Updated on Aug 5 2025 6:38 AM

మృత్యుకుహరాలు గ్రానైట్‌ క్వారీలు

మృత్యుకుహరాలు గ్రానైట్‌ క్వారీలు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీలు మృత్యుకుహరాలుగా మారాయి. పొట్టకూటి కోసం ఒడిశా, ఎంపీ, యుపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కార్మికులు వచ్చి క్వారీల్లో పనిచేస్తూ మృత్యువాత పడుతున్నారు. ఆర్గనైజర్ల ద్వారా పనిలోకి వస్తున్న కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందినా యజమానులు బయటకు తెలియనీయడంలేదు. మృతుల వివరాలు తక్కువగా చూపి మృతదేహాలను మట్టిలో కప్పెడుతున్నారు. దీంతో తమవారు ఎక్కడున్నారో? ఎక్కడ పనిచేస్తున్నారో, అసలు ఏమయ్యారో కూడా వారి కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశంలేదు. ఒకవేళ మృతుల వివరాలు తెలిసిన కార్మికులు ఉన్నా.. క్వారీల యజమానులు వారిని భయపెట్టి వివరాలు కుటుంబ సభ్యులకు చేరకుండా చూస్తున్నారు.

ప్రమాద ఘటనలో మృతులెందరు?

శనివారం జరిగిన బల్లికురవ మండలం కొనెదన రెవెన్యూలోని సత్యకృష్ణ క్వారీ ప్రమాదఘటనలో మృతుల సంఖ్యపై బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పెద్ద దుమారమే రేగింది. పచ్చనేత దివ్యరామాంజనేయులుకు చెందిన ఈ క్వారీలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 15గా ఉందని కొందరు.. కాదు 16 మంది అని మరికొందరు అంతకు మించి ఉండవచ్చని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి ప్రమాద సమయంలో ఆరు జాకీలు పనిచేస్తుండడంతో 18 మందికి తక్కువ లేకుండా ఉన్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారులు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని ప్రకటించారు. వారిలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డట్లు తెలిపారు. కానీ నరసరావుపేట ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు చూపారు. ముగ్గురు గాయపడితే ఏడుగురు ఎలా చికిత్స పొందుతారని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన మృతుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చని, ఆరుగురిని లెక్క చూపి మిగిలిన మృతదేహాలను క్వారీలోనే పూడ్చి పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పొంతన లేని ప్రకటనలు

ప్రమాద ఘటనపై అధికారులు, పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. క్వారీలో 12 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని, ఆరుగురు మృతి చెందిగా ముగ్గురు గాయాలపాలయ్యారని, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారని జిల్లా అధికారి, అధికారులు ప్రకటించారు. క్వారీలో తొమ్మిది మంది కార్మికులు ఉన్నారని, ఆరుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని అదేరోజు సాయంత్రం అద్దంకిలో సీఐ విలేకరులకు చెప్పారు. ఆదివారం నాటికి గాయపడినవారి సంఖ్య ఏడుకు పెరిగింది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో మృతుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చేతులు మారిన రూ. కోట్లు

క్వారీ ప్రమాదంలో పదిమందికి మించి కార్మికులు మృతి చెందితే లీజులు రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రమాదంలో ఎక్కువ మంది మృతి చెందినా ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు చూపుతున్నట్లు సమాచారం. అధికారులు మృతుల సంఖ్యను మార్చిమార్చి చెప్పి ఎట్టకేలకు ఆరుగురుగా ప్రకటించారు. మిగిలిన వారిపై స్పష్టతనివ్వలేదు. క్షతగాత్రుల సంఖ్యను ఇష్టానుసారంగా ప్రకటించడం విమర్శలకు దారితీసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సొంత నియోజకవర్గం కావడంతో ప్రమాద ఘటన అనంతరం అధికారపార్టీ ముఖ్యనేతల జోక్యంతోపాటు రూ.కోట్లలోనే డబ్బులు చేతులు మారిన కారణంగానే అధికారులు మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బల్లికురవ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై అనుమానాలు

నిబంధనలకు పాతర

వాస్తవానికి క్వారీలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. కార్మికులు పనిచేసేటప్పుడు వారికి భద్రతా పరంగా హెల్మెట్లు, బూట్లు ఇతర సామగ్రి ఇవ్వాలి. కార్మికులకు పర్యవేక్షకులుగా మేట్లు, ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్‌ ఉండాలి. ఆదివారం సెలవు కావడంతో వారెవరు లేరని తెలుస్తోంది. అయినా ఆదివారంనాడు కార్మికులతో ఎలా పనిచేయించారో క్వారీ యజమానులు, అధికారులు చెప్పాలి. బల్లికురవ, సంతమాగులూరు పరిధిలో సుమారు 50 క్వారీలు ఉండగా ఒక్కొక క్వారీలో వందమంది చొప్పున 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 60 నుంచి 70 శాతం మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. క్వారీ ప్రమాదాల్లో గడచిన పదేళ్లలో 100 మంది మృతిచెందినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement