
ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి
నరసరావుపేట రూరల్: ఎరువుల వాడకం తగ్గించే విధంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్‌డివిజన్‌లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పాల్గొని మాట్లాడారు. రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు రైతులతో సత్ససంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి రైతు వేసిన పంటను నమోదు చేయాలని, పంట వేయకపోతే వేయలేదని కూడా నమోదు చేయాలని తెలిపారు. వీఏఏలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ శివకుమారి మాట్లాడుతూ వివిధ పంటలలో కలుపు నివారణ, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. భూసారం పెంచేందుకు రసాయన ఎరువుల ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చిరొట్ట, పీఎండీఎస్‌లు పైరులు వేసి 45 రోజులకు భూమిలో కలియదున్నాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.నగేష్, జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి ఎం.అరుణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు