
అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా
నరసరావుపేట రూరల్: తమకు జరుగుతున్న అన్యాయంపై, తమ సమస్యలపై ఇప్పటికే పోలీసు పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు అర్జీలు ఇచ్చామని, అయితే వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని పలువురు బాధితులు జిల్లా ఎస్పీతో మొరపెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర 106 సమస్యలపై ఫిర్యాదులు అందాయి.
పీజీఆర్‌ఎస్‌లో రెండు సార్లు ఫిర్యాదు చేశా..
నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మా ఇంటిపై దాడి చేసి చంపుతామని అన్నెం శివగోపినాథ్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా శివగోపినాథ్, కాకుమాను సుధాకర్‌లు నన్ను దుర్భాషలాడుతూ మేం ఎమ్మెల్యే మనుషులం ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు పెట్టరు మా మాటే వింటారు అంటూ బహిరంగంగా చెబుతున్నారు. ఇంటిపై దాడికి పాల్పడిన సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఇంతవరకు పోలీసులు పరిశీలించలేదు. కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను.
– కె.స్నేహరెడ్డి, న్యాయవాది, నరసరావుపేట
ఎస్పీతో మొరపెట్టుకున్న పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు