
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్‌డీఏ కృషి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రెండవ విడతగా పల్నాడు జిల్లాలో సారధ్యం పర్యటనను సోమవారం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పల్నాడు ప్రాంతంలో పొగాకు పండించే రైతుల అభ్యున్నతికి రూ.200 కోట్లతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉదయం వివిధ క్షేత్రాల సమావేశం నిర్వహించి స్టేషన్‌రోడ్డులో ఛాయ్‌పే చర్చ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పల్నాడు ప్రాంత సమస్యలపై ప్రజల నుంచి తెలుసుకున్నారు. అనంతరం పల్నాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల వద్ద నుంచి జమిందార్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా మేధావుల సదస్సులో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు.
చిన్నారులపై అసభ్య ప్రవర్తన
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
తాడేపల్లిరూరల్: పెనుమాకలో నివాసం ఉండే ఓ వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులు సోమవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బుక్కా వీరయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో వున్న 9, 10 సంవత్సరాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ముళ్ల పొదల్లోకి తీసుకువెళుతున్నాడు. ఆదివారం కూడా ఒక బాలికను ఇదేవిధంగా చేయడంతో గమనించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బాలికను వేధిస్తున్న యువకుడిపై..
తెనాలిరూరల్: ఇంటర్ చదువుతున్న బాలికను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. బాలిక కళాశాలకు వెళ్లి వచ్చేటప్పుడు, చినరావూరుకు చెందిన యువకుడు విజయ్ వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా వారి సహాయంతో వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు.
పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్‌యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాద్ సోమవారం తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైనన్స్, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ టీటీఎం జిల్లా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 13వ తేదీ లోపు ఒక్కొక్క పేపర్ కు రూ.1860లు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిరాక్స్ కాపీల కోసం రూ.2190లు చెల్లించాలని ఆయన సూచించారు.