
ముగిసిన రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాల బాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో 16 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీల విజేతల వివరాలను పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్ర ప్రకటించారు. బాలికల అండర్–14 విభాగంలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమస్థానం కై వసం చేసుకోగా, శ్రీసత్యసాయి జిల్లా రెండవ స్థానం, కర్నూలు, అనంతపురం జిల్లాలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్–19 విభాగంలో తిరుపతి ప్రథమస్థానం సాధించగా, కృష్ణా, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర అండర్–14 విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రథమ స్థానం సాధించగా, పల్నాడు, కర్నూలు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–19 విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తిరుపతి, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
● ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసఫ్ మాట్లాడుతూ, పోటీలో పాల్గొన్న క్రీడాకారుల నుంచి రాష్ట్ర జట్టుకు కొందరు పేర్లు ఎంపిక చేశామన్నారు. తిరిగి వారి ప్రతిభను పరిశీలించి తుది జట్టును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రజట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్‌లో బిహార్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విజేతలకు పాఠశాల చైర్మన్ నాతాని, డైరెక్టర్ కోమటినేని నాసరయ్య బహుమతులు అందించారు. ఫోర్ బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.కిషోర్‌బాబు, పాఠశాల ఇన్‌చార్జి కోట బాపూజీ పాల్గొన్నారు.