
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఏడుగురు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి నుంచి ఏడుగురు ఎంపిక య్యారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయిలో యోగాసనాలు పోటీలు నరసరావుపేట సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఈ నెల 3న నిర్వహించారు. ఈ పోటీలలో సత్తెనపల్లి శక్తి యోగ యోగా గురువు ఎం. రమేష్ సారధ్యంలో సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లికి చెందిన ఎమ్ సునీల్‌కుమార్, తల్లం ఆంజనేయులు, ధనేకుల సాంబశివరావు, వల్లూరు శ్రీనివాస్, పులహరి భానోజి, పులికొండ శ్రీనివాసరావు, మహిళా విభాగంలో డి. కాత్యాయినీ ఏడుగురు గోల్డ్ మెడలు, మెరిట్ సర్టిఫికెట్స్ సాధించటంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సంపాదించారు.
గూడ్స్ రైలు ఢీకొని వృద్ధుడి మృతి
నరసరావుపేట టౌన్: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఇన్‌చార్జి రైల్వే ఎస్‌ఐ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. నరసరావుపేట నుంచి మునుమాక వెళ్లే రైలు మార్గంలో ఆదివారం గుంటూరుకు చెందిన పెండెం సాయిబాబు(65) పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం బంధువులకు అప్పగించారు.
రెంటచింతలలో చోరీ
బంగారు ఆభరణాలు..నగదు అపహరణ
రెంటచింతల: రెంటచింతలలోని రేంజర్‌గారి బజారులో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేంజర్‌గారి బజారులో నివసిస్తున్న జెట్టిపాలెం ఏపీ మెడల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుడు గెల్లిపోగు జనార్ధనరావు మాచర్ల పట్టణంలో ఉంటున్న తన తల్లి మరియమ్మను చూడటానికి శనివారం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో దాచిన 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాస రావు, ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఏడుగురు ఎంపిక