
పని ఒత్తిడి పెంచిన ఈ ఫోన్‌లు మాకొద్దు
నరసరావుపేట: ఒక వైపు యాప్‌ల భారం, మరో వైపు సక్రమంగా పనిచేయని ఫోన్లతో అంగన్వాడీలకు పని ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి అన్నారు. సోమవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీల వద్ద ఉన్న ఫోన్‌లను నరసరావుపేట ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ కాంత కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన విరమించుకోవాలన్నారు. ఫోన్ సక్రమంగా పనిచేయక, సరుకులు నెలలో ఒక్కసారిగా ఇవ్వకపోవడం వంటి కారణాలతో అంగన్వాడీలతో పాటు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మాతా, శిశు సంరక్షణలో అంగన్వాడీల పాత్ర కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని కోరారు. 5జి ఫోన్లు పంపిణీ చేయాలని యూనియన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే కానీ ఫోన్లు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. 5 జి ఫోన్లు పంపిణీ చేసి యాప్‌లు క్రమబద్ధీకరించే వరకు రికార్డులలో లబ్ధిదారులచే సంతకాలు చేయించి పోషకాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సమ్మెలు, ధర్నాలు ఏమీ చేయడం లేదని పనిఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రికార్డుల ద్వారా పనిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కవిత, నిర్మల, అంగన్వాడీలు మాధవి, విజయలక్ష్మి, రమణ, కమురూన్, హసీనా, ఏలీనా పాల్గొన్నారు.
సీడీపీఓ కార్యాలయంలో ఫోన్లు అందజేసిన అంగన్‌వాడీ యూనియన్ నాయకులు