
గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
దుగ్గిరాలలో 63.8 మి.మీ. వర్షపాతం
కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత పది రోజులుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 63.8 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 0.4 మి.మీ. వర్షపాతం కురిసింది. సగటున 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 45.4 మి.మీ., తుళ్ళూరు 28.2, తాడికొండ 25.6, మంగళగిరి 25, పెదకాకాని 20, తాడేపల్లి 19.6, గుంటూరు తూర్పు 17.6, గుంటూరు పశ్చిమ 16.2, ఫిరంగిపురం 8.2, తెనాలి 6.4, చేబ్రోలు 4, పెదనందిపాడు 3.6, కాకుమాను 3.4, మేడికొండూరు 3.4, ప్రత్తిపాడు 2.6, వట్టిచెరుకూరు మండలంలో 2.4 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. జూలై 26వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 138.3 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 228.2 మి.మీ. నమోదైంది.
ముగ్గురు హెచ్‌ఎంలకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మూడు మండలాలకు ఎంఈవో–1లుగా అదనపు బాధ్యతలపై నియమిస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. గుంటూరు వెస్ట్ ఎంఈవో–1గా గుంటూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.హవీలా, పెదకాకాని ఎంఈవో–1గా గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బీవీ రమణయ్య, చేబ్రోలు ఎంఈవో–1గా చేబ్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఆర్. చలపతిరావును నియమించారు.
పిచ్చికుక్క దాడిలో వ్యక్తి మృతి
మార్టూరు: పిచ్చికుక్క దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని కోలల పూడి గ్రామంలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోలల పూడి గ్రామంలో ఈనెల మొదటి వారంలో ఓ పిచ్చికుక్క 12 మంది వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాడిలో గాయపడిన వారిలో కొందరు మార్టూరు, మరికొందరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వారిలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన గాలి యేసులు (65) చికిత్స చేయించుకున్నప్పటికీ గత నాలుగు రోజులుగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యేసులు శుక్రవారం రాత్రి మృతి చెందగా.. శనివారం మృతదేహాన్ని కొలలపూడి తరలించారు.