
చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
కర్లపాలెం: మండల పరిధిలోని దమ్మనవారి పాలెంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 141 గ్రాముల బంగారం, అర కేజీ వెండి, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర చాకచక్యంగా దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేశారని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం కర్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు పెద వెంకటరెడ్డి కుటుంబం ఈ నెల 17వ తేదీన ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లినట్లు తెలిపారు. 21వ తేదీన వారి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉన్నట్లు ఆయన తమ్ముడు గమనించి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 22వ తేదీన వెంకటరెడ్డి వచ్చి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ అయినట్లు గుర్తించారన్నారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలుసుకున్నారని చెప్పారు. నిందితులు బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో సంచరిస్తుండగా అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరం పరిధి కొల్లమూరు గ్రామానికి చెందిన జనదివ్యశేఖర్, పురంపుల్లతి వీధికి చెందిన లంక హర్షవర్ధన్, బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంకు చెందిన మరుప్రోలు నాగేంద్రరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరు పాత నేరస్తులని, జైలులో పరిచయాల మేరకు బయటకు వచ్చిన తరువాత చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. చోరీ సొత్తు పూర్తిగా రికవరీ చేసినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారని వివరించారు. వారికి వ్యక్తిగత రివార్డులు అందిస్తామని తెలిపారు.
141 గ్రాముల బంగారు, అర కేజీ వెండి నగలు స్వాధీనం