
అలరించిన గరికపాటి ప్రవచనాలు
నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ర్యాంప్ నోడల్ అధికారిగా కృష్ణారావు
నరసరావుపేట: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనిచేసేందుకు జిల్లా పరిశ్రమల అధికారి జి.కృష్ణారావును నోడల్ అధికారిగా నియమించారు. ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్ల ర్యాంపు ప్రోగ్రాం ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు కలెక్టర్ శనివారం ఈ ఆదేశాలు జారీచేశారు. ప్రతి నియోజకవర్గస్థాయిలో ఎంఎస్‌ఎంఈ–ర్యాంపు కార్యక్రమం నిర్వహించేలా షెడ్యూల్‌ను తయారుచేసి ప్రతి ఒక్క మండల ప్రత్యేక అధికారికి ప్రణాళిక ప్రకారం ఇవ్వాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ – ర్యాంపు కింద రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్, జేఈడీ వర్క్ షాప్, రివర్స్ బయర్ సెల్లర్ మీటింగ్, వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ టెక్నిక్స్, ట్రేడ్ రేసివబుల్స్‌పై కార్యక్రమం నిర్వహించాలని నోడల్ అధికారి, సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీ, ఎల్‌డీఎం, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పాల్గొన్నారు.