
క్రైస్తవుల రక్షణకు పటిష్ట చట్టం తేవాలి
నరసరావుపేట: భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగం మేరకు క్రైస్తవ మైనార్టీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం రూపొందించి వారిని ఆదుకోవాలని సామాజికవేత్త, జాతీయ క్రైస్తవ, దళిత నాయకుడు డాక్టర్ గోళ్ళమూడి రాజ సుందరబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక బాపనయ్యనగర్ బేతేలు చర్చిలో యూపీఎఫ్ జిల్లా కార్యవర్గం, నేషనల్ క్రిస్టియన్ బోర్డు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్యవక్తగా గోళ్లమూడి పాల్గొని ప్రసంగిస్తూ 2023లో మణిపూర్‌లో 65వేల కుటుంబాలను మారణ హోమానికి గురిచేసిన సంఘటనపై క్రైస్తవులు దేశంవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో ప్రపంచ సువార్తికుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరిగాయన్నారు. పాస్టర్లు స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. సమావేశానికి సత్తెనపల్లికి చెందిన షాలోమ్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు. యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్‌సీ రావు, మాజీ అధ్యక్షుడు జీవరత్నం, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బారావు(జోసఫ్) మాట్లాడారు. వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.
పలు క్రైస్తవ సంఘాల డిమాండ్