
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల పేరిట రూ.36 లక్షల మోసం
నరసరావుపేట రూరల్: ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడకు చెందిన మ్యాట్రిక్స్ కన్సల్టెన్సీ సంస్థ తమను మోసం చేసినట్టు గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన కాకా హనుమంతరావు, ప్రసాదం తేజ రామకృష్ణలు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జాబ్ వీసా కోసం తమ వద్ద రూ.36.50 లక్షలు వసూలు చేశారని, ఇప్పడు సంస్థ కార్యాలయం మూసివేసినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించి 96 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ అందిన అర్జీలలో కొన్ని ఇలా...
● ఫారెక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి నెలా పెట్టుబడిలో 10 శాతం లాభంగా ఇస్తామని చెప్పడంతో నమ్మి మోసపోయానని సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన బలుసుపాటి కోటయ్య ఎస్పీకి తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన రోంగల ప్రవీణ్‌కుమార్, గజ్జల మధుసూదన్‌రెడ్డిలు వ్యాపారం పేరుతో రూ.45,67,500 తీసుకొని మోసం చేశారని వివరించారు.
● నా భర్త ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడని, ఇద్దరు సంతానంతో సత్తెనపల్లి మండలం బృంగబండకు చెందిన పొలేపల్లి రాజీ తెలిపింది. ఆ తరువాత ఆన్‌లైన్‌లో పరిచయమైన హైదరాబాద్‌కు చెందిన నరసింహా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు ఫిర్యాదు చేసింది. తాను రూ.30 లక్షలు మోసం చేసినట్టు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసి వేధిస్తున్నాడని వివరించింది.
● మామ, మరిది శారీరకంగా వేధిస్తున్నారని దాచేపల్లికి చెందిన చిన్నం రమ్య తెలిపింది. నా భర్త కాపురానికి పనికిరాడని వైద్యులు తెలిపారని, నాకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ప్రజాసమస్యల సమస్యల పరిష్కార వేదికలో గతంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు.
● నరసరావుపేటలోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తీసుకొన్న లోన్ మొత్తం చెల్లించినప్పటికీ అదనంగా మరి కొంత చెల్లించాలని సంస్థ సిబ్బంది బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లికి చెందిన ఎండీ హనీఫ్ రహమాన్ కోరారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు