వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారపు శివనాగేశ్వరరావు
సత్తెనపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, పేదల పైన దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణం, అమానుషమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావును కొట్టి తీవ్రంగా గాయపరిచారని, టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత దళితులపైనా, పేద వర్గాలపైనా దాడులు అధికమయ్యాయన్నారు. మొన్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు నడిబజారులో కొట్టిన సంఘటన మరొక ఉదాహరణ అని, రాష్ట్రంలో దళితులంటే తెలుగుదేశం పార్టీకి చిన్న చూపు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇకనైనా దళితులు, పేదల పై దాడులను మానుకోవాలని లేకుంటే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
‘నూటా’ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారికి లేఖ
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం(నూటా) ఎన్నికల్లో పారదర్శకత లోపించడం వలన ఈ నెల 9న జరిగే నూటా ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు ఆచార్య కె.సుమంత్ కుమార్(అధ్యక్ష పదవికి పోటీ అభ్యర్థి), ఆచార్య ఎం.జగదీష్ నాయక్(ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ అభ్యర్థి) తెలిపారు. తమకు పోటీగా నిలబడిన అభ్యర్థులు విశ్వవిద్యాలయం పరిపాలన పరమైన పదవుల్లో కొనసాగటం వలన ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, కనుక ఎన్నికల నిర్వహణ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 15 రోజులు పాటు ఎన్నికలను వాయిదా వేయాలని ఈనెల 4, 5 తేదీల్లో ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్‌కు వినతి పత్రాలు అందించినా నేటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు తమ లేఖలకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు.
దళితులపై పెరిగిన దాడులు